KTR: యువత కేటీఆర్‌ వైపు చూస్తోంది : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ముఖ్యమంత్రి లక్షణాలు ఆయనలో పుష్కలమని ముక్తాయింపు
  • కేసీఆర్‌ తర్వాత ఆయనే సీఎం
  • మీడియా ప్రతినిధులతో మంత్రి

సందర్భమో...అసందర్భమోగాని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు. రాష్ట్రంలో యువత కేటీఆర్‌ వైపు చూస్తోందని, ఆయన నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని చెప్పుకొచ్చారు. కేటీఆర్‌లో ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, కేసీఆర్‌ తర్వాత ప్రభుత్వ పగ్గాలు ఆయనవేనని ముక్తాయించారు.

ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి ఈ ఆసక్తికర వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. అదే సమయంలో బీజేపీపై, కాంగ్రెస్‌పై మంత్రి విరుచుకుపడ్డారు. కమలనాథులు మతం పేరుతో ప్రజల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారని, సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రిని ఎవరైనా కలవవచ్చునని, ఇందుకు ప్రత్యేక కారణాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ నిన్న కేసీఆర్‌తో భేటీ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఇక, సొంత భార్యనే గెలిపించుకోలేని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎం కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఏ ఎన్నికలూ సజావుగా సాగకుండా అడ్డుకోవడమే విపక్షాల పనిగా ఉందని ధ్వజమెత్తారు.

KTR
KCR
Srinivas goud
CM
  • Loading...

More Telugu News