Amaravati: వాటర్ క్యానన్ లు, ముళ్ల కంచెలు... అమరావతిని దిగ్బంధం చేసిన పోలీసులు!

  • నేడు అమరావతి ప్రాంతంలో మహాధర్నా
  • తుళ్లూరు మండలంలో 144 సెక్షన్
  • గ్రామ కూడళ్లలో ముళ్ల కంచెలు
  • దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు పదో రోజుకు చేరాయి. నేడు క్యాబినెట్ సమావేశం సందర్భంగా రైతులు, విపక్షాలు 'మహాధర్నా'కు పిలుపునివ్వడంతో, అమరావతి పరిధిలోని గ్రామాలనన్నింటినీ, పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రతి గ్రామ కూడళ్లలో ముళ్ల కంచెలను సిద్ధం చేశారు. సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగాయి.

ముఖ్యంగా మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారుజామున దుకాణాలను తెరిచేందుకు నిరాకరించిన పోలీసులు, పాలు, మందుల దుకాణాలకు మాత్రమే అనుమతినిచ్చారు. సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్ గ్యాస్, వాటర్ క్యానన్, అగ్నిమాపక దళాలను మోహరించారు. దీంతో అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మందడం వద్ద పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలోని రహదారిపై గత రాత్రి టైర్లను కాల్చి పడవేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, వాటిని ఆర్పివేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.

కాగా, గ్రామాల్లో పోలీసులు కావాలనే యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఈ ప్రాంత రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. తాము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమపై బలాన్ని ప్రయోగిస్తోందని ఆరోపించారు. నేడు ఉద్దండరాయుని పాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నిరసన తెలిపి తీరుతామని రైతులు అంటున్నారు.

నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉన్నందున ఎటువంటి నిరసనలకూ అనుమతి లేదని, ప్రజలు సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. రైతుల నిరసనలు కొనసాగుతున్న దృష్ట్యా, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముగ్గురు డీఎస్పీ స్థాయి అధికారులతో బందోబస్తును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే, కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News