Steve Smith: సింగిల్ రన్ కోసం అంపైర్ తో స్టీవ్ స్మిత్ పోట్లాట!
- మెల్బోర్న్ లో కివీస్ తో ఆసీస్ టెస్టు మ్యాచ్
- కంగారూలకు మొదట బ్యాటింగ్
- డెడ్ బాల్ కు పరుగుతీసేందుకు యత్నించిన స్మిత్
- అడ్డుకున్న అంపైర్ నిగెల్ లాంగ్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు వివాదాలు కొత్తకాదు. భారత్ లో డీఆర్ఎస్ వివాదం, దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్ నేరానికి పాల్పడిన స్టీవ్ స్మిత్ తాజాగా, సొంతగడ్డపై అంపైర్ తో గొడవకు దిగాడు. ఇదంతా ఒక్క పరుగు కోసమేనంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ తన పొరుగుదేశం న్యూజిలాండ్ తో ఆడుతోంది. అయితే, ఆసీస్ తొలిరోజు ఆటలో రెండు వికెట్లు కోల్పోగా, ఆసీస్ ను స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ జోడీ ఆదుకునే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో కివీస్ బౌలర్ నీల్ వాగ్నర్ వేసిన ఓ బంతిని స్మిత్ వదిలేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతి గాల్లో స్వింగ్ అవుతూ వచ్చి స్మిత్ పక్కటెముకలను తాకి దూరంగా పడింది. దాంతో స్మిత్ పరుగు తీసేందుకు ప్రయత్నించగా, అంపైర్ నిగెల్ లాంగ్ అడ్డుకున్నాడు. అంతేకాదు, ఆ బంతిని డెడ్ బాల్ గా ప్రకటించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న స్మిత్ లంచ్ కు వెళ్లే సమయంలో తన ప్రతాపం చూపించాడు. వెళుతున్నంత సేపు అంపైర్ తో గొడవ పడుతూనే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.