YSRCP: మా ప్రభుత్వానికి సంకుచితమైన ఆలోచన లేదు.. ఎవరికీ అన్యాయం జరగదు: వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఉంది
- కానీ, ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదు
- రైతులకు ఎటువంటి నష్టం, ఇబ్బంది కలగదు
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అనంతరం, మీడియాతో విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా ఏపీ రాజధాని నిర్మాణాన్ని లక్షా పదివేల కోట్ల రూపాయలతో నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు ముందుకు వెళ్లనీయడం లేదని అన్నారు.
గత పాలకుడు చంద్రబాబు చేసిన అప్పులు, అనాలోచిత నిర్ణయాల ప్రభావం ప్రజలపై పడిందని విమర్శించారు. ఒక కులం, ఒక ప్రాంతంపైనో కక్ష పూరితంగా ఆలోచించడం లేదని, అలాంటి, సంకుచితమైన ఆలోచనే కనుక ఉంటే రాజధానిని ఏ దొనకొండకో తరలించే వాళ్లమని అన్నారు. రైతులకు ఎటువంటి నష్టం, ఇబ్బంది కలగదని, అవసరమైతే, వారితో చర్చలు జరుపుతామని, అన్ని విషయాల్లోనూ వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
రైతులు ఇచ్చిన భూముల్లో ఓ సిటీని నిర్మించే ఆలోచన ఉంది
రాజధాని అమరావతిని ఇక్కడి నుంచి తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించకముందే చంద్రబాబు నాయుడి పార్టీ, వారి ఎమ్మెల్యేలు, వందిమాగధులు వారి ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు. రైతుల కష్టాలకు కారణం, అమరావతిని నిట్టనిలువునా ముంచింది చంద్రబాబు కాదా? అంటూ ధ్వజమెత్తారు. రాజధానికి రైతులు ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాల్లో ఓ సిటీని నిర్మించి అభివృద్ధి చేయడానికి ఓ కమిటీని నిర్మించే ఆలోచన ప్రభుత్వంలో ఉందని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగదని చెబుతున్నానని, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మరోమారు స్పష్టం చేశారు.