Three capitals proposals opposed by a farmer of Amarawathi: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. అమరావతి రైతు ఆత్మహత్యాయత్నం
- శరీరంపై పెట్రోల్ పోసుకోగా.. అడ్డుకున్న పోలీసులు
- అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదం
- రాజధాని నిర్మాణానికి నాలుగు ఎకరాల భూమిని ఇచ్చానని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనపై రైతుల నిరసనలు తీవ్రమయ్యాయి. తాజాగా అమరావతిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన పోలీసులు అప్రమత్తమై అతడి ప్రయత్నాన్ని నిలువరించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్ అనే రైతు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేస్తూ.. శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
పోలీసులు అడ్డుకోవడంతో అతని ప్రయత్నం విఫలమైంది. అనంతరం రమేశ్ మీడియా, పోలీసుల ముందు తన ఆవేదనను వెళ్లగక్కాడు. అమరావతి నిర్మాణానికి తాను నాలుగు ఎకరాల భూమిని ఇచ్చానని చెప్పాడు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్, కర్నూలు జ్యుడీషియల్ రాజధానులుగా చేయాలని వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించారు. ఏపీకి ఒకే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.