Telugudesam: రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి: టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు
- రాజధానిగా అమరావతినే కొనసాగించాలి
- రేపటి కేబినెట్ భేటీలో మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించాలి
- ప్రభుత్వ నిర్ణయం మారకుంటే.. నిరసనలు ఉద్ధృతం చేస్తాం
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేపు జరిగే మంత్రి వర్గ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిర్ణయం చేయాలన్నారు. రాష్ట్ర కేబినెట్ భేటీ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ఆ మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని ఆరోపించారు.
అమరావతికోసం భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులను అలక్ష్యం చేయడమేకాక, వారిని రోడ్డు మీదకు తెచ్చారని పేర్కొన్నారు. వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ.. కించపర్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశంలో అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం వస్తే.. ఎల్లుండి రాష్ట్ర బంద్ కు పిలుపు ఇస్తామని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలన్నారు.
ప్రభుత్వం కావాలనే ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందన్నారు. నిజాయతీ అధికారులుగా పేరుపొందిన జాస్తి కృష్ణకిషోర్, దామోదర్ నాయుడు, ఉదయ్ బాస్కర్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. క్యాట్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేసివుండాలని అభిప్రాయపడ్డారు.