TSRTC: డిమాండ్ లేని రోజుల్లో టికెట్ ధర తగ్గింపు.. హైదరాబాద్-బెంగళూరు రూట్లో టీఎస్ఆర్టీసీ ప్రయోగం!
- హైదరాబాద్-బెంగళూరు రూటులో అమలు
- రద్దీ ఉన్న శుక్రవారం, ఆదివారం అధిక ధర
- మిగిలిన రోజుల్లో సాధారణ ధర
తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రధాన రూట్లలో డిమాండ్ మేరకు ధర నిర్ణయించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. రద్దీ ఉన్న రోజులు, సాధారణ రోజులకు వేర్వేరు టికెట్లు అమలు చేయాలనుకుంటోంది . ప్రయోగాత్మకంగా దీన్ని హైదరాబాద్-బెంగళూరు రూట్లో నిన్నటి నుంచి అమల్లోకి తెచ్చింది. ఐటీ ప్రొఫెషనల్స్ అధికంగా ఉండే హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య రోజూ 80 నుంచి 90 బస్సులు నడుస్తుంటాయి. ఇందులో 32 బస్సులు టీఎస్ఆర్టీసీవి. గరుడ ప్లస్ ఏసీ బస్సులే 25 ఉన్నాయి. ఇదే రూటులో కర్ణాటక ఆర్టీసీ 25 బస్సులు నడుపుతుండగా, మిగిలినవి ప్రైవేటు ఆపరేటర్లవి.
శని, ఆదివారాలు ఐటీ ప్రొఫెషనల్స్ కు వారాంతపు సెలవు రోజులు కావడంతో ఈ రూట్లో శుక్రవారం సాయంత్రం బెంగళూరు నుంచి, ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రెండు రాజధానుల మధ్య టీఎస్ఆర్టీసీ ధర 950 రూపాయలు.
ఇటీవల కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచడంతో టికెట్ ధర 1300 అయ్యింది. కర్ణాటక ఆర్టీసీ ధరతో పోల్చితే ఈ ధర అధికంగా ఉంది. మరోవైపు ప్రైవేటు ఆపరేటర్లు డిమాండ్ మేరకు ధరను అమలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ తట్టుకోవాలంటే తాము కూడా అదే విధానాన్ని అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ యోచించింది.
డిమాండ్ అధికంగా ఉన్న శుక్రవారం సాయంత్రం, ఆదివారం సాయత్రం పెరిగిన ధరలు అమలు చేయాలని నిర్ణయించింది. సాధారణ రోజుల్లో మాత్రం పాత ధర రూ.950 మాత్రమే వసూలు చేయనుంది. దీనివల్ల ప్రైవేటు, కర్ణాటక ఆర్టీసీ నుంచి పోటీ తట్టుకోవచ్చన్నది యాజమాన్యం ఆలోచన.