AIMIM: ఎన్పీఆర్ అనేది ఎన్నార్సీ అమలుకు ముందు జరుపుతున్న ప్రక్రియే: ఎంపీ అసదుద్దీన్
- సీఎం కేసీఆర్ ను కలిసిన యునైటెడ్ ముస్లిం యాక్షన్ ఫోరమ్
- ఎన్పీఆర్, ఎన్నార్సీ అమలు చేయొద్దని సీఎం కేసీఆర్ కు లేఖ అందజేత
- కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్న ముస్లిం నేతలు
సీఏఏ, జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)లపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని వ్యతిరేకిస్తున్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, పాషాఖాదీలు పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ చట్టాలను అమలు చేయొద్దని సీఎం కేసీఆర్ కు లేఖను అందజేశారు.
మూడు గంటలకుపైగా సాగిన ఈ సమావేశం అనంతరం అసదుద్దీన్ వివరాలను మీడియాకు వివరించారు. ఎన్పీఆర్ ను కూడా నిరోధించాలని తాము సీఎంను కోరామన్నారు. కేరళ ప్రభుత్వం దీనిపై స్టే విధించిన విషయాన్ని కేసీఆర్ కు వివరించామన్నారు. ఎన్పీఆర్ ప్రక్రియ ఎన్నార్సీ ప్రక్రియకు ముందు దశ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, పీఐబీ.. పేర్కొన్న అంశాలను చదివి వినిపించారు. కేంద్ర హోంమంత్రి ఇందుకు వ్యతిరేకంగా చెబుతున్నారని పేర్కొన్నారు.
సెన్సస్ (జన గణన) అనేది 1948 చట్టం ప్రకారం జరుగుతుందన్నారు. ఎన్పీఆర్, ఎన్నార్సీ అనేవి సిటిజన్ షిప్ ఆక్ట్ 1955 ప్రకారం జరుగుతాయన్నారు. దీన్ని వాజ్ పేయి ప్రభుత్వం సవరించిందన్నారు. మన్మోహన్ ప్రభుత్వం హయాంలో ఎన్పీఆర్ తీర్మానం చేసిందని బీజేపీ ప్రభుత్వం అంటోందని తప్పుబట్టారు. ఆ సమయంలో పౌరసత్వాన్ని ఎన్పీఆర్ తో జోడించలేదని అసదుద్దీన్ చెప్పారు. ప్రస్తుతం ఎన్పీఆర్ తో ఎన్నార్సీని బీజేపీ ప్రభుత్వం జోడిస్తోందని అన్నారు. 'మా ఆందోళనను సీఎం కేసీఆర్ కు వివరించాము. దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి వుంది' అన్నారు.