Harsha Bhogle: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే
- ఎన్నికల్లో గెలిపొందామనే కారణంతో ప్రజల మధ్య అంతరాలు పెంచడం సరికాదు
- విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే మరిన్ని ఎన్నికల్లో విజయం సాధించవచ్చు
- మన తర్వాతి తరం మరింత మెరుగైన స్థితిలో ఉండబోతోంది
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే మద్దతు పలికారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఫేస్ బుక్ వేదికగా గట్టి సందేశాన్ని పంపారు. ఎన్నికల్లో గెలుపొందామనే కారణంతో ప్రజల మధ్య అగాధాలు సృష్టించడం సరికాదని ఆయన అన్నారు. ఐకమత్యం, పారదర్శకత, సరళీకరణ ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తే మరిన్ని ఎన్నికల్లో విజయం సాధించవచ్చని సూచించారు. విద్య, టెక్నాలజీ, మౌలిక వసతులను మెరుగుపరచడం... వివిధ వర్గాల మధ్య అంతరాలను నిర్మూలించడం వంటివి చేస్తే... యువత మన దేశాన్ని మనం ఊహించిన దానికంటే ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు.
వారికి ఏమి కావాలో యువ భారతం మనకు చెబుతోందని భోగ్లే తెలిపారు. మనం ఏం చెబుతున్నామో... అది వారికి అవసరం కాకపోవచ్చని చెప్పారు. గత 25 ఏళ్లుగా మనం మంచి జీవితాన్ని అనుభవించామని... యుద్ధాలు, సాంస్కృతిక వ్యత్యాసాల ద్వారా తర్వాతి తరానికి అన్యాయం చేయకూడదని తెలిపారు. మన కంటే మన తర్వాతి తరం మరింత మెరుగైన స్థితిలో ఉండబోతోందని... వారిని అలాగే ఉండనిద్దామని చెప్పారు.