Yarapathineni: టీడీపీ నేత యరపతినేనికి షాక్.. సీబీఐ విచారణకు ఉత్తర్వులు జారీ
- సున్నపురాయి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు
- పన్నులు కట్టకుండా లక్షల టన్నుల సున్నపురాయి తరలించారనే కేసులు
- సీబీఐ విచారణ జరిపించాలని గతంలో అభిప్రాయపడ్డ హైకోర్టు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనపై ఉన్న మైనింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనపై ఉన్న 18 కేసుల విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో యరపతినేని సున్నపురాయి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. పన్నులు కట్టకుండా లక్షల టన్నుల సున్నపురాయిని తరలించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులను గతంలో విచారించిన హైకోర్టు... వీటిని సీబీఐ చేత విచారణ జరిపించాలని అభిప్రాయపడింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలపాలని కోరింది. ఈ నేపథ్యంలో, సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, యరపతినేనిపై సీబీఐ విచారణ జరగనుంది.