RBI: ఏప్రిల్ 1 నాటికి ఆంధ్రా బ్యాంక్ మాయం... మిగిలేది 12 ప్రభుత్వ బ్యాంకులే!
- కార్పొరేషన్ బ్యాంకులో ఆంధ్రా బ్యాంక్ విలీనం
- మార్చి 31 నాటికి విలీనం ప్రక్రియ పూర్తి
- ఫిన్ టెక్ సంస్థలు సవాళ్లను విసురుతున్నాయి
- ప్రభుత్వ బ్యాంకులు మారాలన్న ఆర్బీఐ
ఇండియాలోని 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను, నాలుగు బ్యాంకులుగా మార్చే ప్రక్రియను మార్చి 31 నాటికి ముగించాలని ఆర్బీఐ భావిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రా బ్యాంక్ కనుమరుగు కానుంది. ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంకులు కార్పొరేషన్ బ్యాంకులో విలీనం కానుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల్లో ఇండియాకు చెందిన ఒక్క బ్యాంకు కూడా లేదు. బ్యాంకుల విలీనం ద్వారా అతిపెద్ద బ్యాంకులను సృష్టించాలన్నది ఆర్బీఐ ఉద్దేశం.
ఐదు అసోసియేట్ బ్యాంకుల విలీనం తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 450 బిలియన్ డాలర్ల బ్యాలెన్స్ షీట్ తో వరల్డ్ టాప్-50 బ్యాంకుల్లో చోటును దక్కించుకున్నా, ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయింది. విపరీతంగా పెరిగిపోయిన రుణ బకాయిలు, నిరర్థక ఆస్తులు బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ను దిగజార్చాయి. ఇక గత సంవత్సరం ఆగస్టులో 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగింటిగా మార్చే ప్రక్రియను ఆర్బీఐ ప్రారంభించింది. ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చినా, విలీనం తప్పదని స్పష్టం చేసింది.
ఈ స్కీమ్ లో భాగంగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనం కానున్నాయి. దీంతో ఇండియాలోనే రెండో అతిపెద్ద బ్యాంకు సృష్టించబడుతుంది. ఇదే సమయంలో కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనం అవుతుంది. కార్పొరేషన్ బ్యాంకులో ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంకులు, ఇండియన్ బ్యాంక్ లో అలహాబాద్ బ్యాంకు విలీనం అవుతుంది.
బ్యాంకుల విలీనం ప్రక్రియ మార్చి 31 నాటికి పూర్తయితే, ప్రస్తుతమున్న 19 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గుతుంది. 2017లో ప్రభుత్వ బ్యాంకులు 27 ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ లు విలీనం కాగా, భారతీయ మహిళా బ్యాంక్ సహా ఐదు అనుబంధ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ విలీనం చేసుకుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం పూర్తయితే, భారత బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, మూలధనం నిల్వల పరంగా ప్రభుత్వ సాయం కోసం చూడాల్సిన అవసరం రాబోదని, ప్రపంచ స్థాయి నాణ్యత, భద్రతలతో కూడిన సాంకేతికతతో చెల్లింపుల వ్యవస్థను నడిపించవచ్చని ఆర్బీఐ అంటోంది. ఇదే విషయాన్ని మంగళవారం నాడు విడుదల చేసిన 2018-19 వార్షిక నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. ఇదే సమయంలో ఫిన్ టెక్ సంస్థల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పీఎస్యూ బ్యాంకులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
డిజిటల్ ఇన్నోవేషన్ లో ఫిన్ టెక్ సంస్థలు దూకుడుగా ఉన్నాయని, బ్యాంకులకు సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డ ఆర్బీఐ, గూగుల్, అమెజాన్, వాట్స్ యాప్, ఫేస్ బుక్, పేటీఎం తదితర ఎన్నో సంస్థలు పేమెంట్స్ మార్కెట్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయని గుర్తు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు అందించే సేవలను మరింత సులభతరం చేయాలని సూచించింది.