Temples: గ్రహణం నేపథ్యంలో.. నేటి నుంచే దేవాలయాలన్నీ మూత!
- రేపు ఉదయం సూర్యగ్రహణం
- ఉదయం 8.08 గంటల నుంచి మొదలు
- గ్రహణానికి 9 గంటల ముందు నుంచే ఆలయాల మూసివేత
రేపు ఉదయం సూర్యగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో, నేటి నుంచే దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద వైష్ణవాలయాలన్నీ మూతపడనున్నాయి. రేపు ఉదయం 8.08 గంటలకు గ్రహణం మొదలు కానుండటంతో, అందుకు 9 గంటల ముందుగానే ఆలయాలు మూతపడనున్నాయి.
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రధాన తలుపులను నేటి రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో వేచివున్నందున, వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోకి భక్తులను అనుమతించడం లేదు. రేపు మధ్యాహ్నం ఆలయ శుద్ధి తరువాత 2 గంటల సమయంలో స్వామి దర్శనాలు మొదలవుతాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇక తెలంగాణలోని యాదాద్రి, బాసర, భద్రాచలం, చిలుకూరు, ఏపీలోని అన్నవరం, సింహాచలం తదితర ప్రముఖ దేవాలయాలను నేటి రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకూ మూసివేయనున్నారు. శ్రీకాళహస్తి సహా పలు శివాలయాలను మాత్రం తెరిచే వుంచుతారు. శ్రీకాళహస్తిలో రేపు జరిగే రాహుకేతు పూజల కోసం ఇప్పటికే పట్టణం భక్తులతో కిటకిటలాడుతోంది. గ్రహణ సమయంలో రాహుకేతు పూజలు జరిపించుకుంటే మంచిదని భక్తుల నమ్మకం.