Nara Lokesh: సవాల్ స్వీకరిస్తారా? సాగరతీరంలో జగన్ మాఫియా సినిమా బయటపడుతుంది: నారా లోకేశ్
- ఇన్ సైడర్ ఆరోపణలపై హైకోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం
- విశాఖ, విజయనగరం జిల్లాల్లో 40 వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది
- హైకోర్టు జడ్జితో విచారణకు మీరు సిద్ధమా?
ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు ఏపీలో బాగా వినిపిస్తున్న పదం. అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... ఉత్తరాంధ్ర భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అందుకే రాజధానిని అక్కడకు మార్చాలనుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మీరు చేస్తున్న ఆరోపణలపై హైకోర్టు జడ్జితో విచారణకు తాము సిద్ధమని లోకేశ్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన 40 వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు జడ్జితో విచారణకు మీరు సిద్ధమా? అని సవాల్ విసిరారు. సవాల్ స్వీకరిస్తే.. సాగరతీరంలో జగన్ ల్యాండ్ మాఫియా సినిమా బయటపడుతుందని అన్నారు.
రాజధానిని మార్చడానికి వీల్లేదంటూ అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారని నారా లోకేశ్ చెప్పారు. 7 నెలల పాలనలో ఎలాంటి ఆధారాలు చూపకుండా.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ జగన్ పాత పాటే పాడుతున్నారని మండిపడ్డారు. అందుకే జగన్ కు సవాల్ విసురుతున్నానని చెప్పారు.