Favour on CAA: బెంగాల్లో సీఏఏను సమర్థిస్తూ.. బీజేపీ ర్యాలీ
- ర్యాలీని ప్రారంభించిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా
- బెంగాల్ ప్రజలు సీఏఏను స్వాగతించి.. మోదీకి మద్దతుగా నిలిచారన్న నేత
- నిరసనల్లో చెలరేగిన హింసను సీఎం మమత ఖండించలేదని విమర్శ
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని సమర్థిస్తూ కోల్ కతాలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ర్యాలీని ప్రారంభించారు. సెంట్రల్ కోల్ కతాలో ప్రారంభించిన ఈ ర్యాలీ నాలుగున్నర కిలోమీటర్లు సాగింది. ర్యాలీలో సీఏఏకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి నడ్డా మాట్లాడారు. ఈ రోజు యావత్ పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచారని అన్నారు. ఇక్కడి ప్రజలందరూ సీఏఏను స్వాగతించారని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు దేశ భక్తులని ప్రశంసించారు.
విభజన అనంతరం బంగ్లాదేశ్ వంటి దేశాల్లో పీడనకు గురైన మైనారిటీలు శరణార్థులుగా మనదేశానికి వస్తే వారికి పౌరసత్వం ఇవ్వాలని మన్మోహన్ సింగ్ సూచించారని ఈ సందర్భంగా నడ్డా గుర్తుచేశారు. కాంగ్రెస్ కేవలం తన ఓటు బ్యాంకుకోసమే ఆందోళన చెందుతోందని విమర్శించారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఖరిని తప్పుబడుతూ నడ్డా విమర్శలు చేశారు. సీఏఏపై నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసను మమత ఒక్కసారి కూడా ఖండించలేదన్నారు. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి ప్రవర్తించాల్సిన వైఖరి అది కాదని దుయ్యబట్టారు. జరిగిన పరిణామాలపై చర్యలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి లేదా ? అని ప్రశ్నించారు.