Andhra Pradesh: శాంతియుత సహజీవనమే క్రిస్మస్ సందేశం: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్
- ఏపీ రాజ్ భవన్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
- మానవత్వమే మతం కావాలి
- సకల జనులూ కలిసి మెలిసి ఉండాలి
లౌకిక భారత దేశంలో అన్ని కులాలు మతాలు ఒక్కటేనని, మానవత్వమే మతం కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. విజయవాడలోని రాజ్ భవన్ లో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఏ మతం అయినా విశ్వ శాంతినే కోరుతుందని, శాంతియుత సహజీవనమే క్రిస్మస్ సందేశమని అన్నారు.
కాగా, సకల జనులూ కలిసిమెలిసి ఉండాలన్న క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్ధనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని క్రిస్టియన్ సంఘాల తరుపున హాజరైన మత పెద్దలు గవర్నర్ కు ఆశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు, రాష్ట్ర ప్రోటోకాల్ విభాగపు సంచాలకుడు జీసీ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.