Hyderabad: హైదరాబాద్ మెట్రో రైల్ లో క్యూఆర్ కోడ్ టికెట్ బుకింగ్ ప్రారంభం
- హైటెక్ సిటీ స్టేషన్ లో ప్రారంభించిన ‘మెట్రో’ ఎండీ
- మొదట 20 స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం
- జనవరి నుంచి మిగతా స్టేషన్లలో అందుబాటులోకి వస్తుంది: ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రయాణానికి క్యూఆర్ కోడ్ టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో ఈ విధానాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ‘మేక్ మై ట్రిప్’ సంస్థ సీఈఓ కలసి ప్రారంభించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల సమయం వృథా కాకుండా ‘మేక్ మై ట్రిప్’ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణించవచ్చని, ఆరుగురి వరకు ఒకేసారి దీని ద్వారా బుక్ చేసుకోవచ్చని వివరించారు. బుక్ చేసిన ట్రిప్ ను వాట్సప్ ద్వారా సంబంధిత వ్యక్తులకు షేర్ చేయవచ్చని, రిసీవ్ చేసుకున్న వ్యక్తులు దానిని వేరే వారికి షేర్ చేయొద్దని సూచించారు. మొదట 20 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, జనవరి నుంచి మిగతా మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.