Chandrababu: ఎన్నడూ ఇళ్లలోంచి బయటికి రాని ఆడపడుచులు ఇవాళ రోడ్డెక్కారు: చంద్రబాబు

  • అమరావతిలో చంద్రబాబు పర్యటన
  • ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం
  • రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ విచారం

టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆయన వారు ధర్నా నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లారు. వారికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏనాడూ గడపదాటి బయటికి రాని ఆడపడుచులు ఇవాళ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక పనిచేసుకునే రైతన్నలు, రైతుకూలీలు అందరూ ఆందోళన బాటపట్టారని వివరించారు.

ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో రైతులు తమ భూములు ఇవ్వడం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుందని ఆశించానని, ఇదొక మహానగరం అవుతుందని భావించానని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ చర్చించారని, ఒక్క వివాదం లేకుండా 33 వేల ఎకరాలు సేకరించడం సాధ్యమా అని దీని గురించి ప్రపంచ ప్రఖ్యాత వర్శిటీలు అధ్యయనం చేశాయని వివరించారు. ఇవాళ ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన 29 గ్రామాల రైతులందరూ న్యాయం చేయమని అడుగుతున్నారని, వారందరికీ న్యాయం జరగాలని ఆకాంక్షించారు.

ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా ఇక్కడ రైతులు బాధతో రోడ్డెక్కడం పట్ల బాధపడుతున్నానని పేర్కొన్నారు. ఆ రోజు తానిచ్చిన హామీ వ్యక్తిగతంగా ఇవ్వలేదని, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా ఇచ్చానని, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో తమకు సంబంధంలేదని ప్రభుత్వం అంటే అది చట్టవిరుద్ధం అవుతుందని, రాజ్యాంగ వ్యతిరేకం అని వ్యాఖ్యానించారు.

Chandrababu
Andhra Pradesh
Amaravathi
Farmers
YSRCP
Jagan
Telugudesam
  • Loading...

More Telugu News