Hyderabad: అత్తవారింట్లో కాబోయే అల్లుడి చోరీ.. రూ.2.20 లక్షల నగదు, నగలతో పరార్!

  • హైదరాబాద్‌లోని పాతబస్తీ పరిధిలో ఘటన
  • పెళ్లి కూతురు ద్వారా నగలు, నగదు వివరాల సేకరణ
  • కిటికీ తొలగించి ఇంట్లోకి దూరి చోరీ

కాబోయే అత్తారింటికే కన్నం వేశాడో జామాత. అందినంత నగదు, నగలు దోచుకుని పరారయ్యాడు. ఇప్పుడు తీరిగ్గా ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. హైదరాబాద్‌, పాతబస్తీలోని కాలాపత్తర్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. శాస్త్రిపురం కింగ్ కాలనీకి చెందిన సల్మాన్‌ఖాన్ (27) సేల్స్‌మన్. కాలాపత్తర్‌కు చెందిన యువతితో అతడికి వివాహం నిశ్చయమైంది.

కాగా, పెళ్లి కుమార్తె ద్వారా అత్తవారింట్లోని నగదు, నగలు విషయాన్ని తెలుసుకున్న సల్మాన్‌ఖాన్‌లో దుర్బుద్ధి మొదలైంది. వాటిని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ రచించాడు. ప్రార్థనల కోసం కాబోయే అత్తింటివారు దర్గాకు వెళ్లిన విషయం తెలుసుకున్న సల్మాన్ తన పథకాన్ని అమలు చేశాడు.

ఇంటికి చేరుకుని కిటికీ తొలగించి లోపలికి దూరాడు. బీరువాలోని రూ.2.20 లక్షల నగదు, నగలు తీసుకుని పరారయ్యాడు. దర్గా నుంచి ఇంటికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు నగలు, నగదు మాయం కావడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీకెమెరాల ఆధారంగా చోరీ చేసింది కాబోయే అల్లుడేనని తేల్చారు. అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

Hyderabad
theft
son-in-law
  • Loading...

More Telugu News