Hospital: మూడేళ్లుగా యువతి శరీరంలో బుల్లెట్... ఎలా వచ్చిందో మాత్రం తెలియదట!
- శరీరంలో నొప్పితో ఆసుపత్రిలో చేరిక
- ఆపరేషన్ చేసి బుల్లెట్ ను బయటకు తీసిన వైద్యులు
- కేసును విచారిస్తున్న పోలీసులు
వెన్నెముకలో వస్తున్న భరించలేని నొప్పి నుంచి ఉపశమనం కోసం ఓ యువతి ఆసుపత్రికి వెళ్లగా, పరీక్షలు చేసిన వైద్యులు విస్తుపోయారు. ఆమె శరీరంలో ఓ బుల్లెట్ ఉందని గుర్తించి, దాన్ని బయటకు తీశారు. ఈ ఘటన హైదరాబాద్, ఫలక్ నుమా ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కుమార్తె (18) కుట్టుమిషన్ కుట్టుకుంటూ పొట్టపోసుకుంటోంది. మూడు నెలలుగా వెన్నెముకలో నొప్పిగా ఉండటంతో నిమ్స్ లో చేరింది.
వివిధ పరీక్షల తరువాత, ఆమె శరీరంలో గాయం ఉందని తేల్చిన వైద్యులు, ఆపరేషన్ చేయగా, బుల్లెట్ బయటపడింది. ఇది కనీసం మూడేళ్ల నుంచి ఆమె శరీరంలో ఉండి ఉండవచ్చని వైద్యులు తేల్చారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వారు గతంలో ఏ ప్రాంతంలో ఉండేవారు? అక్కడ ఏదైనా ఫైరింగ్ పాయింట్స్ ఉన్నాయా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.