Kieron Pollard: పొలార్డ్ సిక్సర్ల హోరు... కటక్ వన్డేలో టీమిండియా టార్గెట్ 316 రన్స్
- కటక్ వన్డేలో భారీ స్కోరు సాధించిన విండీస్
- రాణించిన పొలార్డ్, పూరన్
- సైనీకి రెండు వికెట్లు
నిర్ణయాత్మక చివరి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలింగ్ ను ఉతికారేస్తూ 51 బంతుల్లోనే 74 పరుగులు చేయగా, వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పొలార్డ్ స్కోరులో 3 ఫోర్లు, 7 భారీ సిక్సులున్నాయి. ఆఖరి ఓవర్లో షమీ బౌలింగ్ లో కొట్టిన స్ట్రెయిట్ సిక్సులు ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచాయి. కరీబియన్ బ్యాట్స్ మెన్ ధాటికి ఆఖరి 5 ఓవర్లలో భారత బౌలర్లు ఏకంగా 77 పరుగులు సమర్పించుకున్నారు.
అంతకుముందు టీమిండియా టాస్ గెలిచి విండీస్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ పోరులో విండీస్ బ్యాటింగ్ లైనప్ లో ప్రతి ఒక్కరూ రెండంకెల స్కోరు సాధించారు. ముఖ్యంగా నికోలాస్ పూరన్ బ్యాటింగ్ అద్భుతమైన రీతిలో సాగింది. పొలార్డ్ తో కలిసి పూరన్ భారత బౌలర్లను ఎదుర్కొన్న తీరు విండీస్ ను భారీస్కోరు దిశగా నడిపించింది. పూరన్ 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 89 పరుగులు చేశాడు. స్టార్ ఆటగాళ్లు షాయ్ హోప్ 42, హెట్మెయర్ 37 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నవదీప్ సైనీ 2, షమీ, జడేజా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.