Stuvart Puram: స్టూవర్టుపురం నుంచి వచ్చి తెలంగాణలో పట్టుబడిన దొంగల ముఠా!
- గతంలో 20కి పైగా చోరీలు చేసిన ముఠా
- అనుమానాస్పదంగా తిరుగుతూ మఫ్టీ పోలీసులకు పట్టుబడ్డ వైనం
- పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఏపీలోని స్టూవర్టుపురం నుంచి వచ్చి తెలంగాణలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠా ఆటను గజ్వేల్ పోలీసులు కట్టించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లాకు చెందిన స్టూవర్టుపురం గ్రామానికి చెందిన ఎం వెంకటేశ్వర్లు, గజ్జెల అంకాలు, ఆవుల రాజవ్వలు తెలంగాణలో మకాం వేసి, పిక్ పాకెటింగ్, ప్రయాణికుల బ్యాగులు, సూట్ కేసులు చోరీ చేస్తున్నారు. వీరందరిపై దాదాపు 20 వరకూ చోరీ కేసులు ఉన్నాయి.
గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. వీరు ముగ్గురూ గజ్వేల్ సమీపంలోని ప్రజ్ఞాపూర్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా, మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకుని విచారించారు. ఆపై వీరు చేసిన దొంగతనాల వివరాలు కూపీ లాగారు. వీరి నుంచి ఐదున్నర తులాల బంగారం, గొలుసు, 4 తులాల చంద్రహారం, 3 తులాల నల్లపూసల దండ తదితరాలతో పాటు బంగారు లాకెట్ తదితరాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.