IRCTC: మరోసారి ఆహారం ధరలను పెంచిన ఐఆర్సీటీసీ!
- ఇటీవలే శతాబ్ది, దురంతో రైళ్లలో ధరల పెంపు
- తాజాగా ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు వర్తింపు
- ఇకపై సాధారణ భోజనం ధర రూ. 80
రైళ్లలో ఆహారం ధరలను ఐఆర్సీటీసీ మరోసారి పెంచింది. ఇటీవల శతాబ్ది, దురంతో తదితర ప్రీమియం రైళ్లలో ఆహార ధరలన్నీ పెంచిన సంస్థ, ఇప్పుడు ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలోనూ ధరలను పెంచింది. ప్లాట్ ఫారమ్ లపై ఉండే స్టాళ్లలో విక్రయించే ఆహార ఉత్పత్తుల ధరలనూ పెంచుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సాధారణ మీల్స్ ధర రూ. 50 ఉండగా, ఇకపై అది రూ. 80కి పెరిగింది. అల్పాహారం ధరలు రూ. 10 చొప్పున పెరిగాయి. జనతా ఆహార ధరలపై మాత్రం ప్రస్తుతానికి ఐఆర్సీటీసీ కనికరం చూపింది. టీ, కాఫీలను రూ. 10కి, వెజ్ బిర్యానీ రూ. 80, ఎగ్ బిర్యానీ రూ. 90, చికెన్ బిర్యానీ రూ. 110కి లభ్యమవుతుందని పేర్కొంది.