Uttar Pradesh: కాన్పూర్ లో ఫైరింగ్ ఓపెన్ చేసిన పోలీసు... వైరల్ అవుతున్న వీడియో!
- పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న నిరసనలు
- చేతిలో రివాల్వర్ తో పోలీసు అధికారి హల్ చల్
- యూపీలో రేపటి వరకూ ఇంటర్నెట్ సేవలు బంద్
పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చిన తరవాత, దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న వేళ, ఆందోళనకారులపై తుపాకులు ప్రయోగించరాదన్న నిబంధనకు విరుద్ధంగా ఓ యూపీ పోలీసు, తన చేతిలోని రివాల్వర్ ను పేలుస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటికే నిరసనకారుల్లో 15 మంది మరణించగా, వీరిలో అత్యధికులు బులెట్ గాయాల కారణంగానే ప్రాణాలు కోల్పోయారని పోస్టుమార్టం నివేదికలు చెబుతున్నాయి.
వారిలో వారే కాల్చుకుంటున్నారని పోలీసు అధికారులు వెల్లడించిన నేపథ్యంలో, పోలీసులు ఫైరింగ్ చేశారనడానికి సాక్ష్యం బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ వీడియో కాన్పూర్ లో తీసినదిగా తెలుస్తోంది. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ, వేలాది మంది రోడ్లెక్కి, నిరసనలు చెబుతుండగా, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారుల కారణంగా దాదాపు 300 మందికి పైగా పోలీసులకు గాయాలైనట్టు తెలుస్తోంది. 57 మంది ఫైర్ ఆర్మ్స్ కారణంగా, మరో 263 మంది రాళ్ల దాడుల వల్ల గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
తాజా వీడియోలో సేఫ్టీ జాకెట్, హెల్మెట్ ధరించిన పోలీసులు, నిరసనకారుల మధ్యకు వెళ్లి, రివాల్వర్ ను ప్రయోగించినట్టు కనిపిస్తుండగా, యూపీ పోలీస్ చీఫ్ ఓపీ సింగ్ మాత్రం కాల్పుల కారణంగా ఎవరూ మరణించలేదని స్పష్టం చేశారు. యూపీలోని అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని, వదంతులు పోస్ట్ చేసిన 13 వేల వెబ్ సైట్లను గుర్తించామని తెలిపారు.