Telangana: పౌరసత్వ సవరణ చట్టంపై సీఎం కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలి: వీహెచ్
- ముస్లింలు, ఎస్సీలను సీఎం మోసం చేస్తున్నారు
- హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం పెడతానని ఎందుకు పెట్టలేదు?
- కేసులు పెట్టినా.. భయడను
పౌరసత్వ సవరణ చట్టంపై సీఎం కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ముస్లింలు, ఎస్సీలను సీఎం మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాదులోని గాంధీభవన్ లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయనని కేసీఆర్ ఎందుకు చెప్పరని ప్రశ్నించారు.
‘హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం పెడతానని ఎందుకు పెట్టలేదు? సీఎం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం లేదని తాము విగ్రహాన్ని తీసుకొస్తే.. రెండు నెలలుగా ఈ విగ్రహాన్ని పోలీసు స్టేషన్ లోనే పెట్టారు. నాపై కేసు కూడా పెట్టారు. ఈ కేసులకు భయడను. బీజేపీతో పొత్తు ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా పౌరసత్వ సవరణ చట్టంపై తన వైఖరిని స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేయమని ప్రకటించారు’ అని వీహెచ్ అన్నారు.