Justice for disa: దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే సగం వరకు కుళ్లిపోయాయి: గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్
- మైనస్ నాలుగు డిగ్రీల్లో భద్రపరిచాం
- అయినా ఇప్పటికే యాభై శతం డీకంపోజ్ అయ్యాయి
- మరో వారం అయ్యేసరికి పూర్తిగా పాడవుతాయి
దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు మరో వారం రోజులలో పూర్తిగా పాడవుతాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కోర్టుకు తెలిపారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన నిందితుల మృతదేహాలను భద్రపరచాలని కోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం వాటిని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. ఈ మృతదేహాల పరిస్థితిపై కోర్టు ఆరాతీసింది. దీనిపై కోర్టుకు శ్రవణ్ సమాధానమిస్తూ మార్చురీలో మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో మృతదేహాలను భద్రపరిచామని, అయినప్పటికీ ఇప్పటికే యాభై శాతం కుళ్లిపోయాయని వివరించారు.
మరో వారం రోజులయ్యేసరికి వంద శాతం కుళ్లిపోయే అవకాశం ఉందని వివరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని మృతదేహాలు పాడవ్వకుండా ఉండేందుకు మరోచోట భద్రపరిచే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా తనకు తెలియదని శ్రవణ్ బదులిచ్చారు.