Amaravathi: అమరావతిలో రోడ్డుకు అడ్డంగా మోదీ, అమిత్ షా, పవన్ ఫ్లెక్సీలు.. కొనసాగుతున్న ఆందోళన
- జీఎన్ రావు కమిటీ నివేదికతో భగ్గుమన్న రైతులు
- రోడ్లపైనే వంటావార్పు
- పిల్లాపాపలతో రోడ్లపైకి చేరుకుని బైఠాయింపు
అమరావతిలో మందడం రైతుల ఆందోళన కొనసాగుతోంది. రాజధాని విషయంలో జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి అందించిన నివేదికపై భగ్గుమన్న రైతులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు.
ఈ ఉదయం పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. రోడ్లపై టైర్లు అంటించే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, మందడం మెయిన్ సెంటర్‌లో రోడ్డుకు అడ్డంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బుద్ధుడి ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను కట్టారు. అలాగే, రిలే నిరాహార దీక్షలకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు, రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతులు అర్ధనగ్నంగా కూర్చుని నిరసన తెలిపారు. రోడ్డుపైనే వంటావార్పు చేపట్టిన రైతులు.. మూడు రాజధానుల ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని కోరగల్లులోనూ నిరసనలు వెల్లువెత్తాయి. స్థానికులు తమ పిల్లాపాపలతో కలిసి రోడ్డుపైకి చేరుకుని బైఠాయించారు. నీరుకొండ కొండవీటి వాగు వద్ద రైతులు ఆందోళనకు దిగడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది.