America: ట్రంప్ కీలక నిర్ణయం.. ఎన్ఎస్ఎఫ్ డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ సేతురామన్ పంచనాథన్
- శాస్త్రవేత్తకు కీలకపదవి కట్టబెట్టిన ట్రంప్ సర్కారు
- సేతురామన్ ఆరిజోనా విశ్వవిద్యాలయం ముఖ్య పరిపాలనాధికారి
- కొత్త సంవత్సరంలో బాధ్యతల స్వీకరణ
అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబానికి చెందిన సేతురామన్ పంచనాథన్ కు అక్కడి ట్రంప్ సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో ముఖ్య పరిపాలనాధికారిగా ప్రస్తుతం పనిచేస్తున్న సేతురామన్ ను ప్రతిష్టాత్మక ఎన్ఎస్ఎఫ్ డైరెక్టర్ గా నియమించింది. ప్రస్తుత డైరెక్టర్ ప్రాన్స్ కార్డోవా పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుండడంతో వచ్చే ఏడాది ప్రారంభంలో సేతురామన్ డైరెక్టర్ పదవిని చేపడతారు.
వైద్య రంగంతో సంబంధం లేని సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రాథమిక పరిశోధన, విద్యకు ఉద్దేశించిన జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఎలక్ట్రానిక్స్ డిగ్రీ, మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ లో పీజీ చేసిన సేతురామన్ కెనడాలోని ఒట్టావా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు.