ajit pawar: ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఏసీబీ క్లీన్ చిట్
- ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ
- గతంలో ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ ఏసీబీ అఫిడవిట్
- ఇప్పుడు అలాంటిదేమీ లేదంటూ మరో అఫిడవిట్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఊరట లభించింది. ఆయన ఎటువంటి అవినీతికి పాల్పడలేదని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) క్లీన్చిట్ ఇచ్చింది. అజిత్ పవార్ జలవనరుల మంత్రిగా పనిచేసిన సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (వీఐడీసీ) పరిధిలోని 12 ప్రాజెక్టుల్లో ఆయన ఎటువంటి అవినీతికి పాల్పడలేదని బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్‌కు తాజాగా ఏసీబీ అఫిడవిట్ సమర్పించింది.
ఏసీబీ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ సమర్పించిన ఈ అఫిడవిట్లో అజిత్ పవార్‌కు క్లీన్చిట్ లభించినట్టు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతకుముందు ఇదే బెంచ్‌కు ఏసీబీ సమర్పించిన అఫిడవిట్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిలో అజిత్ పాత్ర కూడా ఉన్నట్టు ఏసీబీ పేర్కొనడం గమనార్హం.