Amaravathi: జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్ లో చర్చిస్తాం: మంత్రి బొత్స
- రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి
- రైతుల ప్రయోజనాలు కాపాడతాం
- అసైన్డ్ భూములను మాత్రం రైతులకే తిరిగి ఇచ్చేస్తాం
జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నెల 27న కేబినెట్ సమావేశంలో ప్రవేశపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నివేదిక వెలువడ్డ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు.
కమిటీ నివేదికపై మంత్రి వర్గ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడతామని, వారికి గత ప్రభుత్వం ఏ ప్రకారం చెప్పిందో అలా చేస్తామని, ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి ఇస్తామని మరోమారు స్పష్టం చేశారు. అయితే, అసైన్డ్ భూములను మాత్రం సంబంధిత రైతులకే తిరిగి ఇచ్చేస్తామని, ఆ తర్వాత కావాలంటే వాళ్లు మళ్లీ అమ్ముకోవచ్చని చెప్పారు. ఈ విషయం గురించే మంత్రి పెద్దిరెడ్డి చెప్పారని, ఆ విషయాన్ని వక్రీకరించారని విమర్శించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీ నివేదికలను గత ప్రభుత్వం పక్కన పెట్టి నారాయణ కమిటీతో ముందు కెళ్లారని విమర్శించారు. మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్న ప్రశ్నకు బొత్స స్పందిస్తూ, ప్రతిపక్షాలను ఏ విధంగా సంతృప్తి పరుస్తామని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం తప్ప ప్రతిపక్షాలకు కాదని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోని బలహీనవర్గాలకు, దళితులకు చంద్రబాబు అన్యాయం చేశారని, ఆ విషయాన్ని తాము తప్పుబడితే ఒప్పుకోరని విమర్శించారు.