CAA: పౌరసత్వ సవరణ చట్టంపై అపోహలు వద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి
  • నిరసన ప్రదర్శనల్లో పాల్గొనే ముందు సీఏఏ చట్టం చదవాలి
  • జాతీయ పౌర జాబితా (ఎన్ ఆర్సీ) డ్రాఫ్ట్ ఇంకా రూపొందించలేదు

పౌరసత్వ సవరణ చట్టంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలతో పాటు, మేధావులు కూడా తమ  ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లోని అణచివేతకు గురైన మైనారిటీల కోసమే ఈ చట్టమని మంత్రి చెప్పారు.

కిషన్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ‘ఆ మూడు దేశాల్లో హింసకు గురవుతున్న మైనారిటీలైన సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, హిందువులు, క్రిస్టియన్లు శరణార్థులుగా భారత్ కు వచ్చి దుర్భర జీవితం గడుపుతున్నారు. వారందరూ మతపరమైన వివక్షకు గురై వారి దేశంనుంచి వెళ్లగొట్టబడ్డారు. వారందరికీ చేయూత నందించడానికి మా ప్రభుత్వం నడుంబిగించింది. సీఏఏ చట్టం ఏ ఒక్క మతానికి, రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించేది కాదు. ప్రతిపక్షాలు, మేధావులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి’ అని అన్నారు.

'నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేముందు ఒక్కసారి సీఏఏ చట్టాన్ని చదివి అడుగేయండి' అని ప్రజలకు, విపక్షాలకు కిషన్ రెడ్డి సూచించారు. జాతీయ పౌర జాబితా(ఎన్ ఆర్సీ) చట్టం ఇంకా రూపొందించలేదన్నారు. అయితే ఏ దేశమైనా ఈ జాబితా రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నారు. ఈ చట్టంపై ఎప్పుడో ఇక్కడికి వచ్చిన ముస్లింలు అపోహ పెట్టుకోవద్దన్నారు. శ్రీలంక నుంచి, ఉగాండా నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం ఇచ్చామని మంత్రి తెలిపారు.  

CAA
union minister of state for Home Kishan Reddy comments
Political Parties should read CAA before step into the Agitation
  • Loading...

More Telugu News