Andhra Pradesh: ఈలోగా ఆంగ్లమాధ్యమ ప్రక్రియ చేపడితే అధికారులే బాధ్యత వహించాలి: ఏపీ హైకోర్టు
- 'ఆంగ్ల మాధ్యమం'పై పిటిషన్ వేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి
- హైకోర్టులో విచారణ
- ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు
- తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసిన కోర్టు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది.
ఆంగ్ల మాధ్యమ నిర్ణయంపై పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ లోగా ఆంగ్లమాధ్యమ ప్రక్రియ చేపడితే అధికారులే బాధ్యత వహించాలని తెలిపింది. కాగా, ఆంగ్ల మాధ్యమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఆ మీడియంలోనే విద్యా బోధన జరగాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.