Pakistan: మరణశిక్ష అమలు చేసే లోపు ముషారఫ్ చనిపోతే.. మృతదేహాన్ని ఈడ్చుకు రండి: తీర్పులో కోర్టు ఆదేశాలు
- దేశద్రోహం కేసులో దోషిగా తేలిన ముషారఫ్
- మరణశిక్ష విధించిన ప్రత్యేక కోర్టు
- సంచలన ఆదేశాలు జారీ
మరణశిక్ష అమలు చేసే లోపు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కనుక చనిపోతే.. అతడి మృతదేహాన్ని పార్లమెంటుకు ఈడ్చుకు రావాలని అధికారులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. పార్లమెంటు బయట ఆ మృతదేహాన్ని మూడు రోజులపాటు వేలాడదీయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ ద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముషారఫ్‌ను దోషిగా తేల్చిన పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక కోర్టు మంగళవారం అతడికి మరణశిక్ష విధించింది. ఈ తీర్పునకు సంబంధించి గురువారం 169 పేజీల పూర్తి పాఠాన్ని విడుదల చేసింది.
3 నవంబరు 2007లో దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసిన అప్పటి సైనికాధ్యక్షుడు ముషారఫ్ దేశాధ్యక్షుడయ్యాడు. నవాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2013లో ముషారఫ్‌పై రాజద్రోహం కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత వైద్య చికిత్సల పేరుతో దుబాయ్ వెళ్లిపోయిన ముషారఫ్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. తాజాగా, ఈ కేసులో ఆయనకు కోర్టు మరణశిక్ష విధించింది. మరోవైపు, ముషారఫ్‌కు విధించిన మరణశిక్షపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు ఆ దేశ సైనికాధికారులు కూడా వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.