CAA oppsed by parties: హింసకు దిగితే.. ఖబడ్దార్.. నష్టం పూడ్చడానికి మీ ఆస్తులు వేలం వేస్తాం: యూపీ సీఎం యోగి
- సీఏఏను నిరసిస్తూ హింసకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు
- ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదు
- హింసకు దిగిన వారికి సంబంధించి వీడియోలు తీశాం
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనకు దిగి హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. నిరసనల్లో జరిగిన ఆస్తుల నష్టానికి బదులు తీర్చుకుంటామన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదని పేర్కొన్నారు. సీఏఏను నిరసిస్తూ రాష్ట్ర రాజధాని లక్నో సహా, ఇతర ప్రాంతాల్లో ఈ రోజు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో యోగి మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, వామపక్ష పార్టీలు దేశాన్ని మంటల్లోకి తోస్తున్నాయని ఆరోపించారు.
లక్నో, సంబల్ ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారి ఆస్తులను వేలంవేసి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. ఈ ఘటనల్లో హింసకు దిగిన వారికి సంబంధించి వీడియోలు తీశామన్నారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గత నెల 8 నుంచి రాష్ట్రంలో ఎలాంటి ప్రదర్శనలు చేయకూడదని నిషేధం విధించామన్నారు. ఎలాంటి ప్రదర్శనలైనప్పటికీ ముందస్తు అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం సీఏఏను ఉపయోగించుకుంటున్నాయన్నారు.