Siddipeta ADCP Narsimha Reddy Arrested by ACB Officials: అక్రమాస్తుల కేసులో సిద్ధిపేట డీసీపీ నర్సింహారెడ్డి అరెస్టు
- రూ.10కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారుల వెల్లడి
- 14 రోజులు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
- చంచల్ గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిద్ధిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నర్సింహారెడ్డికి చెందినవిగా భావిస్తున్న వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లో ఏసీబీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహించి రూ.10 కోట్ల ఆస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లో కిలోన్నర బంగారం, రూ.5.33 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ.6.37 లక్షలున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
గోల్కొండలో నర్సింహారెడ్డికి ఖరీదైన విల్లా ఉందని తేల్చారు. శంకర్ పల్లి, గొల్లపల్లి, జహీరాబాద్ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఉన్నాయని గుర్తించగా, సిద్దిపేట, మహబూబ్ నగర్ లో 20 ఎకరాల వ్యవసాయ భూమిని కలిగివున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అరెస్టు చేసిన నర్సింహారెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ ను విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో నర్సింహారెడ్డిని చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు.