Andhra Pradesh: సుజనా చౌదరి వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్

  • తానే ప్రధాని, తానే బీజేపీ అధిష్ఠానమని సుజనా అనుకుంటున్నారు
  • కృష్ణాజిల్లా వాసిగా ఉత్తరాంధ్ర అభివృద్ధినే కోరుకుంటున్నా
  • నిపుణుల కమిటీ సూచనమేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది

అమరావతి నుంచి రాజధానిని మార్చడం అంత సులువు కాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అనడంపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో మీడియాతో నాని మాట్లాడారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉంటే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశముందని చెప్పారు. నిపుణుల కమిటీ సూచనమేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుదన్నారు.

రాజధానిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వైఖరిని విమర్శిస్తూ.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లుగా ఆయన తీరు ఉందని ధ్వజమెత్తారు. జైలులో పెడతారని బీజేపీలోకి వెళ్లిన సుజనా చెప్పిన మాటలను ఎవరు వింటారు? అని నాని ప్రశ్నించారు. తానే ప్రధాని, తానే బీజేపీ అధిష్ఠానం అన్నట్లుగా సుజనా మాట్లాడుతున్నారని నాని పేర్కొన్నారు.

రాజధానికోసం 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని జగన్ చెప్పారు... అయితే రాజధానిలో 30 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? సగం రోడ్లకు, సగం కంపెనీలకు ఇస్తే ఇక్కడ ఏముందంటూ నాని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రెండు లక్షల కోట్లతో రాజధాని సాధ్యమేనా? అని నాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కృష్ణాజిల్లా వాసిగా ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుకుంటున్నానన్నారు. ఢిల్లీ దేశంలో ఓ చివర ఉందని... దేశానికి మధ్యలో పెట్టండి అంటే పెడతారా? అని అమరావతి రాజధానిగా ఉండాలనుకుంటున్నవారిని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News