janasena: మూడు రాజధానులు ఉంటే తప్పు కాదు, ముగ్గురు పెళ్లాలు ఉంటేనే తప్పు: పవన్ కు వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ కౌంటర్
- పవన్ ఎప్పుడేమి మాట్లాడతాడో ఆయనకే తెలియదు
- సీఎం మాటలను పవన్ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు
- చంద్రబాబు, పవన్ ల ట్విట్టర్ ఖాతాలు ఒకరే నడుపుతున్నట్టుంది
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి కట్టడానికే దిక్కులేదు, ఇంకా మూడు రాజధానులు కావాల్సి వచ్చాయా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఎప్పుడేమి మాట్లాడతాడో ఆయనకే తెలియదని విమర్శించారు. సీఎం జగన్ మాట్లాడిన విషయాలను ఆయన వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని విమర్శించారు.
ఏపీకి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తపరిస్తే పవన్ కు ఏం అర్థమైందో తనకు తెలియడం లేదని అన్నారు. ‘మూడు రాజధానులు ఉంటే తప్పేమీ లేదు, ముగ్గురు పెళ్లాలు ఉంటే తప్పు’ అంటూ పవన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపైనా ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చేసే వ్యాఖ్యలు వేరుగా ఉన్నా, వాదన ఒకేలా ఉందని విమర్శించారు. వీళ్లిద్దరి ట్విట్టర్ ఖాతాలను ఒకరే నడుపుతున్నట్టు కనిపిస్తోందన్న అమర్ నాథ్ రెడ్డి, చంద్రబాబు, పవన్ రాజకీయపార్టీలు నడిపే నైతికహక్కు కోల్పోయారని ఘాటుగా విమర్శించారు.