Patiyala Trial court sets one-week deadline for convicts to file mercy plea: నిర్భయ దోషులకు క్షమాభిక్ష కోరేందుకు అవకాశమిచ్చిన పాటియాలా కోర్టు

  • వారం రోజుల గడువు ఇచ్చిన కోర్టు 
  • ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు ఆదేశం
  • తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా

నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు మరణ శిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లి వేసిన పిటిషన్ పై విచారణను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు వాయిదా వేసింది. దోషులకు క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకునేందుకు వారం రోజుల గడువును ఇచ్చింది. ఈ మేరకు దోషులకు నోటీసులు జారీచేయాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఈ కేసులో దోషి అక్షయ్ సింగ్ పెట్టుకున్న సమీక్ష పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉండడంతో, నిర్భయ తల్లి పెట్టుకున్న పిటిషన్ ను పాటియాలా హౌస్ కోర్టు ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఈ రోజు సుప్రీంకోర్టు దోషి అక్షయ్ సింగ్ పిటిషన్ ను కొట్టి వేయడంతో, పాటియాలా హౌస్ కోర్టు నిర్భయ తల్లి వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. దోషి పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసినందున.. నిందితులకు డెత్ వారెంట్ జారీ చేసేందుకు ఎలాంటి అవరోధాలు లేవని నిర్భయ తల్లి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మరోవైపు దోషుల తరపు న్యాయవాదులు ప్రతివాదనలు చేస్తూ.. దోషులకు న్యాయపరమైన అవకాశాల కల్పన పూర్తయిన తర్వాతే డెత్ వారెంట్ జారీచేయాలని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయస్థానం స్పందిస్తూ.. దోషులు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చేంతవరకు ఎదురుచూస్తామని పాటియాలా కోర్టు పేర్కొంటూ..తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News