gvl: వేల ఎకరాల భూములను సేకరించారు.. ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితి ఏంటీ?: జీవీఎల్

  • ప్రాంతాల వారీగా అభివృద్ధి అనేది చాలా ముఖ్యం
  • రాజకీయ, సామాజిక కోణంలో నిర్ణయాలను సమర్థించేది లేదు
  • రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి
  • భూములిచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి

ప్రాంతాల వారీగా అభివృద్ధి అనేది చాలా ముఖ్యమని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ, సామాజిక కోణంలో ఇటువంటి నిర్ణయాలను సమర్థించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

భూములిచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని, వేల ఎకరాల భూములను సేకరించారని, ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటని జీవీఎల్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చే అవకాశం ఉందని తాను ముందే చెప్పానని అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. మూడు రాజధానులని అనడం సముచితం కాదని చెప్పారు.

అభివృద్ధిని వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందని జీవీఎల్ అన్నారు. అమరావతిపై ఇంకా స్పష్టత ఇవ్వాలని, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని జీవీఎల్‌ డిమాండ్ చేశారు. భూములిచ్చిన రైతులకు అన్యాయం జగరకుండా ఏ విధంగా వ్యవహరిస్తారో చెప్పాలని అన్నారు. ప్రజలను అయోమయానికి గురి చేయొద్దని కోరారు. చట్ట పరంగా రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News