Nara Lokesh: తప్పుడు ప్రచారం చేసిన జగన్ క్షమాపణ చెబితే బాగుంటుంది: నారా లోకేశ్
- బీసీలకు టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అప్పట్లో జగన్ ఆరోపించారు
- రూ. 28.8 వేల కోట్లు ఖర్చు చేశారని ఇప్పుడు ఒప్పుకున్నారు
- వైయస్, చంద్రబాబుల్లో ఎవరు గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవాలి
తన పత్రిక దొంగ పత్రికని, అందులో రాసేవన్నీ అసత్యాలే అని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు బీసీలకు అన్యాయం చేస్తున్నారని... ఒక్క రూపాయి కూడా వారికి కేటాయించలేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఆరోపించారని చెప్పారు. బీసీలకు స్వయం ఉపాధిని కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆదరణ పథకంలో నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారని ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ పాలనలో బీసీలకు కేటాయించిన రూ. 36 వేల కోట్లలో రూ. 28.8 వేల కోట్లను ఖర్చు చేశారని వైసీపీ ఒప్పుకుందని తెలిపారు. నాడు చేసిన తప్పుడు ప్రచారానికి జగన్ బహిరంగ క్షమాపణ చెబితే బాగుంటుందని అన్నారు.
23 జిల్లాలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీల కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించిన వైయస్ గొప్పవారో... 13 జిల్లాలు ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ లో రూ. 28.8 వేల కోట్లను ఖర్చు చేసిన చంద్రబాబు గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవాలని కోరుతున్నానని లోకేశ్ అన్నారు.