Jagan: మూడు రాజధానులతో దక్షిణాఫ్రికా కూడా నష్టపోయింది: జగన్ పై యనమల ఫైర్
- మూడు రాజధానులతో నష్టమే తప్ప లాభం లేదు
- దక్షిణాఫ్రికా కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో ఉంది
- ఉద్యోగులను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తారా?
ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడుతోంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, మూడు రాజధానులతో రాష్ట్రానికి నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు అని జగన్ చెప్పారని... ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు అభివృద్ధి చెందిన దేశాలను పరిగణనలోకి తీసుకుంటారా? లేక వెనుకబడిన దేశాలను తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాఫ్రికా వెనుకబడిన దేశమని చెప్పారు. మూడు రాజధానులతో దక్షిణాఫ్రికా కూడా నష్టపోయిందని... ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో ఉందని తెలిపారు.
సచివాలయ ఉద్యోగులు అతి కష్టం మీద హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చారని... ఇప్పుడు వారిని మళ్లీ విశాఖకు తరలిస్తారా? అని యనమల ప్రశ్నించారు. జగన్ ధోరణి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని విమర్శించారు. ప్రజలు కూడా ఉద్వేగాలకు లోను కాకుండా... తమ భవిష్యత్తు కోసం సరైన దిశలో ఆలోచించాలని సూచించారు.