Jagan: కలెక్టర్లు, ఎస్పీలతో విందు సమావేశంలో పలు సూచనలు చేసిన జగన్

  • అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మెలిసి పని చేయాలి
  • అహంభావానికి ఎవరూ తావు ఇవ్వకండి
  • జనవరి 1 నుంచి గ్రామాల బాట పట్టండి

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు నిన్న రాత్రి విజయవాడలోని బరంపార్కులో ముఖ్యమంత్రి జగన్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులకు జగన్ పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో... అధికారులు, ప్రజాప్రతినిధులు పాలునీళ్లలా కలిసి మెలిసి పని చేయాలని సూచించారు. అవినీతికి తావు లేకుండా అంతా కృషి చేయాలని చెప్పారు. అహంభావానికి ఎవరూ తావు ఇవ్వకూడదని... ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని... ఈ తరుణంలో అవి ప్రజలకు చేరేందుకు శ్రమించాలని చెప్పారు.

జనవరి 1వ తేదీ నుంచి ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాల బాట పట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను పరిశీలించాలని చెప్పారు. ఉదయం 8 గంటలకు ముందు, రాత్రి 9 గంటల తర్వాత అధికారులకు ఫోన్లు చేసి వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించవద్దని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. 

  • Loading...

More Telugu News