Visakhapatnam: విశాఖలో నేడు రెండో వన్డే.. ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- కోల్‌కతా వైపు వెళ్లే, అటువైపు నుంచి వచ్చే వాహనాల మళ్లింపు
- పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
- మ్యాచ్ మొదలైన తర్వాత జాతీయ రహదారిపై వాహనాలకు అనుమతి
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విశాఖపట్టణంలో నేడు భారత్-విండీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్ ఏడీసీపీ ఎం.రమేశ్ కుమార్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కోల్‌కతా, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలను ఆనందపురం వద్ద మళ్లిస్తున్నట్టు చెప్పారు. విజయనగరం వైపు వెళ్లే వాహనాలను ఎన్ఏడీ వద్ద దారి మళ్లించినట్టు చెప్పారు.
క్రికెట్ మ్యాచ్ చూడడానికి శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలను మారికవలస వద్ద మళ్లిస్తారు. మ్యాచ్ మొదలైన తర్వాత జాతీయ రహదారిలో అన్ని వాహనాలను అనుమతించనున్నట్టు రమేశ్ కుమార్ తెలిపారు. అలాగే, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పార్కింగ్ స్థలంలో కాకుండా ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారం వాహనాలను పార్కింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.