Tirumala: తిరుమల కొండపై సిలువ ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తా: లోకేశ్ కు వెల్లంపల్లి సవాల్
- అన్యమత ప్రచారంపై శాసనమండలిలో వాగ్వాదం
- కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందన్న లోకేశ్
- అన్యమత ప్రచారం వెనుక లోకేశ్ హస్తం ఉందన్న వెల్లంపల్లి
తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై ఏపీ శాసనమండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ పాలనలో తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. కొండపై సిలువను ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి సమాధానంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, అన్యమత ప్రచారం వెనుక లోకేశ్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. వాస్తవానికి కొండపై ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని చెప్పారు.
సోషల్ మీడియాలో అన్యమత ప్రచారం చేస్తూ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు లోకేశ్ యత్నిస్తున్నారని వెల్లంపల్లి అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ యత్నిస్తోందని చెప్పారు. వేంకటేశ్వరస్వామితో రాజకీయాలు వద్దని... టీడీపీ ఇప్పటికే నాశనమయిందని, ఆలయాల జోలికి వస్తే మరింత నాశనమవుతారని అన్నారు. తిరుమల కొండపై సిలువ ఉందనేని టీడీపీ సోషల్ మీడియా క్రియేటివిటీ అని దుయ్యబట్టారు. సిలువ ఉన్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. నిరూపించలేకపోతే లోకేశ్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై నారా లోకేశ్ మండిపడ్డారు. తాను ప్రచారం చేస్తున్నట్టు నిరూపించాలని... నిరూపించలేని పక్షంలో సభకు వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.