JC Diwakar Reddy: వైసీపీ వాళ్లు తప్పులు చేస్తుంటే మనమెందుకండీ చెప్పడం?: చంద్రబాబుకు జేసీ సలహా
- అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతిలో జేసీ సందడి
- చంద్రబాబుతో సమావేశం
- తాజా పరిస్థితులపై చర్చ
ఎక్కడైనా ధర్మం వర్తిస్తుంది కానీ రాజకీయాల్లో మాత్రం కాదని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలు వింటే అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు బోధించారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న జేసీ, ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతి విచ్చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో చంద్రబాబుతో సమావేశమైన ఆయన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.
"వైసీపీ వాళ్లు తప్పులు చేస్తుంటే మీరెందుకు చెప్పడం! వాళ్లను తప్పులు చేయనివ్వండి, ప్రజలక్కూడా ఎవరేంటో తెలియాలి కదా! వాళ్లు తప్పులు చేసుకుంటూ వెళుతుంటే మీరు సరిదిద్దడానికి తొందరపడుతున్నట్టుంది. వాళ్లు ఎన్ని తప్పులు చేస్తారో చెయ్యనివ్వండి. జగన్, ఆయన వర్గం ఎన్ని తప్పులు చేస్తే మనకు అంత మంచిది. ఒక్క చాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్న జనాలకు ఇప్పటికే తల వాచిపోయింది. సినిమా పూర్తిగా అర్థం కావాలంటే మరికొంత సమయం పడుతుంది. మీరు మాత్రం వాళ్ల తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేయొద్దు" అంటూ అధినేతకు విడమర్చి చెప్పారు.
అందుకు చంద్రబాబు బదులిస్తూ, ఓవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాజకీయాల కోసం మనం చూస్తూ ఉండలేం కదా అని వ్యాఖ్యానించారు. దాంతో జేసీ అందుకుని, 'ప్రజలు ఎవరికి ఎక్కువ సీట్లు ఇచ్చారో ఓసారి చూడండి... మనకు 23, వాళ్లకు 151. ప్రజల బాధ్యత వాళ్లపైనే ఎక్కువగా ఉంది. ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సింది వైసీపీ వాళ్లే'నంటూ బోధించారు.