Onions: సరైన టైములో ఉల్లి పంట వేశాడు... కోటీశ్వరుడయ్యాడు!
- ఉల్లికి విపరీతంగా పెరిగిన డిమాండ్
- కర్ణాటక రైతు అదృష్టం
- భారీగా ఆదాయం
దేశంలో ఉల్లి ధరలు ఇప్పటికీ తగ్గలేదు. కిలో రూ.150, ఆపైనా ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ రైతు ఉల్లి పండించి కోటీశ్వరుడయ్యాడు. చిత్రదుర్గ జిల్లాకు చెందిన మల్లికార్జున అనే రైతు తనకు చెందిన 10 ఎకరాల్లో ఉల్లి పంట వేశాడు. రూ. 15 లక్షల రుణం తీసుకుని సాగు చేశాడు. సరైన సమయంలో ఉల్లిపంట చేతికి రావడంతో మల్లికార్జున పంట పండింది. 240 టన్నుల వరకు దిగుబడి రావడంతో మార్కెట్లో ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం కోటి రూపాయలకు పైగా మల్లికార్జునకు ఆదాయం వచ్చింది.
మామూలు సీజన్లలో 10 ఎకరాల్లో ఉల్లి వేస్తే మహా అయితే రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చేది. అనూహ్యరీతిలో ఉల్లికి డిమాండ్ పెరగడం ఈ కన్నడ రైతును కరోడ్ పతిని చేసింది. కాగా, ఉల్లికి విపరీతమైన డిమాండ్ ఉందని తెలుసుకున్న మల్లికార్జున, అతని కుటుంబసభ్యులు పంటకు కాపలాగా రాత్రింబవళ్లు పొలం వద్దే పహరా కాశారు. ప్రస్తుతం కర్ణాటక వ్యవసాయ వర్గాల్లో మల్లికార్జున పేరు మార్మోగిపోతోంది.