Kuldeep Sengar: 'ఉన్నావో అత్యాచారం' కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ను దోషిగా తేల్చిన కోర్టు
- బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్ ను దోషిగా తేల్చిన తీస్ హజారీ కోర్టు
- 18వ తేదీన శిక్షను ఖరారు చేయనున్న కోర్టు
ఉన్నావో అత్యాచారం కేసులో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. 19వ తేదీన సెంగార్ కు శిక్షను ఖరారు చేయనుంది.
2017లో మైనర్ అయిన బాధితురాలు ఘోర అత్యాచారానికి గురయింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసు విషయంలో పోలీసులు, ఇతర అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కేసు విచారణ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో బాధితురాలి కుటుంబీకులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారనే నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఘటన జరిగిన ఏడాది తర్వాత సెంగార్ ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు, బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై బహిరంగంగా మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాతే ఈ ఘటనపై గత ఏడాది కేసు నమోదు చేశారు. తన గోడును పట్టించుకోవాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆమె ఆత్మాహుతికి యత్నించారు. ఆ తర్వాతే ఈ కేసులో కదలిక మొదలైంది. చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటడంతో సెంగార్ ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు.
బాధితురాలి తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో గత ఏడాది ఏప్రిల్ 3వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 9న ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకు ముందే తనకు, తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందంటూ బాధితురాలు సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. సెంగార్ కు చెందిన వ్యక్తులు తన కుటుంబాన్ని బెదిరించారని లేఖలో పేర్కొంది.
జూలైలో బాధితురాలు తన లాయర్, ఇద్దరు సమీప బంధువులతో కారులో ప్రయాణిస్తుండగా... వారి వాహనాన్ని వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ట్రక్కు నెంబర్ ప్లేటుపై నెంబర్ కనపడకుండా రంగు పూశారు. ఈ ప్రమాదంలో ఆమె బంధువులిద్దరూ చనిపోయారు. వీరిలో ఒకరు అత్యాచారానికి ప్రత్యక్ష సాక్షి కావడం గమనార్హం.
మరోవైపు, ఉత్తరప్రదేశ్ లో బాధితురాలికి న్యాయం జరగకపోవచ్చని భావించిన సుప్రీంకోర్టు... విచారణను లక్నో కోర్టు నుంచి ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. కేసును విచారించిన కోర్టు సెంగార్ ను దోషిగా నిర్ధారించింది.