West Bengal: దీదీ...మీ తీరు రాజ్యాంగ విరుద్ధం!: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్
- పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రకటనలా?
- ఇందుకు ప్రభుత్వ ధనాన్ని ఎలా వ్యయం చేస్తారు
- ఈ నేరపూరిత చర్యను తక్షణం ఆపండి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం ప్రసారమాధ్యమాల్లో ప్రకటనలు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. దాన్ని నేరపూరిత చర్యగా గవర్నర్ అభివర్ణించారు. పార్టీ అనుకూల ప్రకటనల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, తక్షణం దీన్ని ఆపాలని హుకుం జారీ చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
దీన్ని తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకానివ్వమంటూ మమత ప్రకటించారు. అది ఆమె తరం కాదంటూ ఓ కేంద్ర మంత్రి కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్ని చైతన్య పరిచేందుకు టీవీల్లో ప్రకటనలు వస్తున్నాయి. ఈ చర్యను గవర్నర్ సీరియస్ గా తీసుకున్నారు.
'పార్లమెంటు ఓ అంశంపై చట్టం చేశాక దానికి వ్యతిరేకంగా ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజా ధనం దుర్వినియోగం చేయడం అవుతుంది. పార్లమెంటు చట్టాన్ని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. మీరు రాజ్యాంగానికి బద్ధులై పనిచేస్తూ శాంతిని కాపాడాలని కోరుతున్నాను' అంటూ గవర్నర్ కోరారు.
ఇటీవల గవర్నర్‌ను అసెంబ్లీలోకి రానివ్వకుండా గేట్లకు తాళం వేయించిన మమతా బెనర్జీ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.