Supreme Court: ఇలాంటి పరిస్థితుల్లో కలుగజేసుకోలేం.. శాంతినే కోరుకుంటున్నాం: వర్సిటీల్లో హింసపై సుప్రీంకోర్టు
- మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న న్యాయవాది జైసింగ్
- సుమోటోగా స్వీకరించాలని వినతి
- నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే
- ఆస్తుల ధ్వంసం, హింస ఆగిపోతే కేసును స్వీకరిస్తామని వ్యాఖ్య
జేఎంఐ, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలపై సుప్రీంకోర్టులో ప్రస్తావన వచ్చింది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, సుమోటోగా స్వీకరించాలని న్యాయస్థానాన్ని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే.. దీన్ని తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కలుగజేసుకోలేమని, తాము శాంతినే కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ వర్సిటీల్లో ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయని సీజే వ్యాకహ్యానించారు. ప్రజా ఆస్తుల ధ్వంసం, హింస ఆగిపోతే రేపు కేసును స్వీకరిస్తామని చెప్పారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ లపై బుధవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.