Jamia Millia Islamia University: నేను ముస్లింను కాదు.. అయినా, నన్ను టార్గెట్ చేశారు: జేఎంఐ విద్యార్థిని ఆవేదన

  • విద్యార్థులకు ఢిల్లీ సురక్షిత ప్రాంతమని భావించా
  • ఇక్కడే రక్షణ దొరక్కపోతే ఇంకెక్కడ దొరుకుతుంది?
  • మంచికి అండగా నిలబడలేనప్పుడు ఈ చదువెందుకు?

పౌరసత్వ చట్టంపై నిరసన కార్యక్రమాలు ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. విద్యార్థులు బస్సులతో పాటు పలు ఆస్తులకు నిప్పంటించారు. ఆందోళనలను నియంత్రించే క్రమంలో పోలీసులు జరిపిన దాడుల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

ఈ సందర్భంగా యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థిని మాట్లాడుతూ, ఢిల్లీలోనే తమకు రక్షణ దొరకకపోతే... ఇంకెక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. 'విద్యార్థులకు సురక్షిత ప్రాంతంగా ఢిల్లీని భావిస్తుంటాం. ఇది సెంట్రల్ యూనివర్శిటీ కూడా. ఇలాంటి చోట మాకు పూర్తి రక్షణ ఉంటుందని, మాకు ఏమీ జరగదని నేను భావించాను. కానీ, జరిగిన ఘటనలతో రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?' అంటూ మీడియా ఎదుట సదరు విద్యార్థిని కంటతడి పెట్టింది.

ఈ దేశం సురక్షితం కాదని ఇప్పుడు నేను భావిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించింది. ఎక్కడకు వెళ్లాలో, ఎక్కడ ఉరితీతకు గురి కావాలో తనకు అర్థం కావడం లేదని చెప్పింది. రేపొద్దున భారతీయులే తన స్నేహితులుగా ఉంటారా? అనే సందేహం నెలకొందని తెలిపింది. తాను ముస్లింను కానప్పటికీ... తొలి రోజు నుంచి తాను టార్గెట్ గానే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మంచికి అండగా నిలబడే పరిస్థితి కూడా లేనప్పుడు ఈ చదువు ఎందుకని ప్రశ్నించింది.

యూనివర్శిటీలో హింస చెలరేగే సమయానికి తాను లైబ్రరీలో ఉన్నానని ఆమె తెలిపింది. యూనివర్శిటీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తనకు సూపర్ వైజన్ నుంచి కాల్ వచ్చిందని చెప్పింది. లైబ్రరీ నుంచి తాను వెళ్లబోయేంతలోగానే కొందరు విద్యార్థులు పరుగున లైబ్రరీలోకి వచ్చారని... 30 నిమిషాల్లోనే లైబ్రరీ మొత్తం విద్యార్థులతో నిండిపోయిందని తెలిపింది. కొందరు విద్యార్థుల ఒంటిపై అప్పటికే రక్తం ఉందని చెప్పింది. ఇంతలోనే లైబ్రరీలోకి పోలీసులు వచ్చారని... తమను దుర్భాషలాడారని తెలిపింది. లైబ్రరీ నుంచి ప్రతి ఒక్కరూ వెళ్లిపోవాలని వారు గట్టిగా అరిచారని చెప్పింది.

ఆ తర్వాత తాను తన హాస్టల్ కు బయల్దేరానని... అప్పటికే కొందరు విద్యార్థులు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండటాన్ని తాను చూశానని ఆమె తెలిపింది. దీంతో, తాము చేతులు పైకెత్తి నడవడం మొదలు పెట్టామని.. చివరకు తాను హాస్టల్ కు చేరుకున్నానని చెప్పింది. ఇంతలోనే కొందరు విద్యార్థులు తమ హాస్టల్ వద్దకు పరుగు పరుగున వచ్చి... మహిళా పోలీసులు కొట్టడానికి ఈ హాస్టల్ వద్దకు వస్తున్నారని హెచ్చరించారని... దీంతో, పక్కనే ఉన్న పొదల చాటుకు పరుగెత్తి, తాను అక్కడ దాక్కున్నానని తెలిపింది. ఆ తర్వాత తిరిగి తాను హాస్టల్ కు చేరుకున్నానని... ఈ సందర్భంగా నెత్తురోడుతున్న ఎందరో విద్యార్థులను తాను చూశానని తెలిపింది.

మరోవైపు ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, కొందరు అల్లరిమూకలు యూనివర్శిటీలోకి ప్రవేశించి, రాళ్లు రువ్వడాన్ని ప్రారంభించారని... ఆ తర్వాతే అక్కడకు పోలీసులు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఈ హింసాత్మక ఘటనలకు కారణం ఎవరనే విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News