Kamal Haasan: కమల్ పోస్టర్లపై పేడ కొట్టేవాడినన్న లారెన్స్... విమర్శల వెల్లువతో కమల్ ఇంటికెళ్లి వివరణ!
- 'దర్బార్' ఆడియో వేడుకలో లారెన్స్ ప్రసంగంపై విమర్శలు
- కమల్ హాసన్ గొప్ప వ్యక్తని వివరణ
- కమల్, రజనీ ఫ్యాన్స్ మధ్య గొడవలు వద్దని సూచన
తాను చిన్న వయసులో ఉన్నప్పుడు రజనీకాంత్ అంటే అభిమానంతో కమల్ హాసన్ సినిమా పోస్టర్లపై పేడ కొట్టే వాడినని దర్శక నటుడు లారెన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో, కమల్ ఇంటికి వెళ్లిన లారెన్స్ వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన 'దర్బార్' ఆడియోలో పాల్గొన్న లారెన్స్ చేసిన ప్రసంగంపై మండిపడ్డ కమల్ అభిమానులు, లారెన్స్ కు పరిపక్వత లేదని, అప్పుడు చేసిన దాన్ని ఇప్పుడు చెప్పుకోవడంతోనే ఆయన మనసులోని ఆలోచన బయటపడిందని నిప్పులు చెరిగారు.
దీంతో కమల్ ఇంటికి వచ్చిన లారెన్స్, కొంతసేపు మాట్లాడి, ఆయనతో ఫోటో దిగారు. కమల్ తనను కుశల ప్రశ్నలు వేశారని, తన వివరణను అర్థం చేసుకున్నారని చెప్పారు. కమల్ ను తాను విమర్శించానన్న కోణంలో ఆలోచించ వద్దని, వారిద్దరి మధ్యా బలమైన స్నేహం ఉందని, వారి ఫ్యాన్స్ గా మనం కూడా గొడవ పడవద్దని పిలుపునిచ్చారు. కమల్ చిత్రంలో తాను నటించే చాన్స్ వచ్చినా, కాల్షీట్స్ లేక ఆ చాన్స్ మిస్ చేసుకున్నానని, ఓ గొప్ప వ్యక్తిని తాను ఎలా విమర్శించగలనని ఆవేదన వ్యక్తం చేశారు. లారెన్స్ తాజా వివరణతో కమల్ ఫ్యాన్స్ కాస్తంత శాంతించినట్టే కనిపిస్తోంది.